9 Jan 2010

తెలుగు తల్లి: స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మ



తెలుగుతల్లి. చల్లని తల్లి. పలు కూడల్లలో ప్రశాంతంగా నిలబడి ప్రజలందరినీ సమానంగా ఆధరించే తల్లి. ఈ తల్లి ఇప్పుడు లొల్లికి నిలయంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కొందరు స్వార్ద రాజకీయ నాయకుల చేతిలో అవసరానికి పనికొచ్చే కీలుబొమ్మగా మారింది.

ఒకప్పుడు ఆంధ్రా నేతలు తెలంగాణాను ఆక్రమించుకోవడానికి చూపించిన, ఈరోజు దోపిడీదార్లు వదలకుండా తెలంగాణాను అంటిపెట్టుకోవాడానికి చూపిస్తున్న ఒకే ఒక్క కారణం, "మనమంతా తెలుగు వాళ్లం, తెలుగుతల్లి బిడ్డలం".

అవును నిజమే, మనమందరం తెలుగువాళ్లమే, తెలుగుతల్లి బిడ్డలమే. కాదని ఎవరన్నారు. ఇక్కడ ఎవరూ తల్లిని దూరం చేసుకోవాలనుకోవడం లేదు. తల్లి పేరుతో దోచుకునే వాళ్ళని తరమి కొడుతున్నారు. అది ఎంత మాత్రం తప్పు కాదు. నీ మెతుకులు నువ్వు తిను, నా గంజి నేను త్రాగుతా అని తెలంగాణ ప్రజలు మొత్తుకుంటుంటే మధ్యలో వీళ్ళ ఈ తల్లి లొల్లేంది.

తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్కరోజులోనే తెలుగుతల్లి గర్భసంచి నుండి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పుట్టించిన వీళ్ళు అసలు తెలుగుతల్లిని ఎలా పుట్టించారో ఒక్కసారి గుర్తుచేసుకుందాము. మన చుట్టుపక్కల రాష్ట్రాలకు లేని తల్లి భాగ్యం మనకే ఎలా దక్కిందో ఒక్కసారి మననం చేసుకుందాం.

ఈ తల్లి మూలాలు మనకు మొదట ముట్నూరి కృష్ణారావు రచనలో కనబడతాయి. 1913 May 24th కృష్ణాపత్రిక సంపాదకీయం "మాతృసందర్శనం"లో ఆయన మొట్టమొదట ఆంధ్రామాతను ఆవిష్కరించాడు.

"భరతమాత ముద్దుకొమరిత యగుచు
అలరి మన ఆంధ్రమాత వర్దిల్లేడుగాత"

అని ఆంధ్రమాతకు తల్లి భరతమాత అని ఆమె జన్మవృత్తాంతం చెప్పాడు.

1914 లో గడ్డం కొండారెడ్డి "ఆంధ్రమాతృస్తవము" అన్న శీర్షికన పద్యాలు రాశారు. అప్పటికీ ఈతల్లి భావన ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఏదో కవులు వాళ్ల ఊహల్లో వివరిస్తూ, ప్రాసకోసం ఈ తల్లిని వాడుకోవడం తప్ప ఈ తల్లి భావనను ముందుకు తీసుకెల్లలేక పోయారు.

తర్వాతి కాలంలో రాయప్రోలు "ఆంధ్ర" శీర్షికతో పద్యాలు రాశారు.
"నాదు జాతి నా దేశము నాదు భాష
అను అహంకార దర్శనమందు మాంధ్ర"
అని ఆంధ్రబిడ్డడికి అహంకార దర్శనం ఒంటబట్టించుకోమని నీతిభోద చేసాడు.

ఈ నీతిని నిలువెళ్ళా ఒంటబట్టించుకున్న "శ్రీ" అన్న రచయిత
"భారత...చీ కాదు
ఆంధ్రమాతకు జై"
అని రాసి నిజంగానే ఆంధ్రా అహంకారాన్ని ప్రదర్శించాడు.

ఆతర్వాత కాలంలో వీళ్ల ఆంధ్రోధ్యమంలో రాయలసీమ వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 1937 లో ఈ రెండు ప్రాంత నేతలు కలిసి "శ్రీ భాగ్" ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఆంధ్రావాళ్ళు ఆంధ్రమాతకు రూపం మార్చి, కొత్తపేరు చేర్చి "తెలుగుతల్లి" గా నామకరణం చేసారు. అంతకు ముందు ఆంధ్రా అహంకారాన్ని పెంచాలని ప్రయత్నించిన రాయప్రోలు, "తెనుగుతల్లి" పద్యాలు రాసి, తెలుగు వారిమందరమూ తెలుగుతల్లి ముద్దు బిడ్డలమే అని కొత్త పల్లవి అందుకొని ఆంద్రోధ్యమ సాధనలో తల్లిని ముందుంచాడు.

ఇలా ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం అప్పట్లో ఆంధ్రోద్యమం, ఈ ఆంధ్రోధ్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రమాత వెలిసాయి. తర్వాతి కాలంలో రాయలసీమ వాళ్ళని కూడా కలుపుకొని పోవలసిన పరిస్థితి దాపురించండంతో ఆంధ్రమాతకు మారువేషం వేసి తెలుగుతల్లిగా రూపాంతరం చెందించారు.

ఆ తర్వాత ఆంధ్రరాష్ట్రం ఏర్పడడం, తదనంతరం తెలంగాణాను కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడం జరిగాయి. ఇలా వీళ్ళ అవసరాలు తీరిన తర్వాత చాలా రోజుల వరకు ఈ తల్లిని పట్టిచ్చుకున్న నాథుడే లేకుండా పోయాడు. మళ్లీ ఈ దోరలకు రాష్ట్రంలో కాంగ్రేస్ ను ఎదుర్కొని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తెలుగుతల్లి అవసరం వచ్చింది. నందమూరి తారకరామారావు గారు తెలుగు వాడి ఆత్మ గౌరవం పేరుమీద మళ్ళీ ఈ తల్లిని నెత్తినెత్తుకున్నాడు. అధికారంలోకి రావడానికి ఆయుధంగా వాడుకున్నాడు. ఈ తల్లి దీవెనల ఫలితంగా పదవిలోకి వచ్చిన తర్వాత కృతజ్ఞతగా ఒక రూపం ఇచ్చి, విగ్రహంగా మార్చి కూడల్లల్లో నిలబెట్టాడు.

ఈ సంఘటనలకు, వాటివెనుకున్న భావోద్వేగాలకు అప్పటి/ఇప్పటి తెలంగాణ పోరాటానికి ఎటువంటి సంబంధమం లేదు. తెలుగుతల్లి తెలంగాణ పోరాటానికి, ఈ ఉధ్యమ నిర్మాణానికి ఎన్నడూ సహకరించలేదు. ఆంధ్రా వాళ్ళకి మళ్ళే తెలంగాణ వాళ్ళకి తల్లులను ముందు పెట్టుకొని ఉద్యమం చేసే అవసరం కూడా ఎన్నడూ రాలేదు. అయితే, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు మాట్లాడే ప్రజలందరిలాగే తెలుగుతల్లిని ఆరాధించారు తప్ప ఎన్నడూ కూడా దూషించలేదు.

తెలంగాణ కవులుగానీ, కళాకారులుగానీ ఎన్నడూ తెలుగుతల్లిని గానీ, భరతమాతను గానీ తూలనాడలేదు. అగౌరవంగా మాట్లాడి తమ అహంకారం ప్రదర్శించుకోలేదు. ఆంధ్రాకవి భరతమాతను చీకొట్టినా అది సంస్కారంగానే చెలామణి అయ్యింది.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ది పేరు మీద ఎక్కడ ప్రతిష్టించాలో తెలియక గల్లి గల్లి త్రిప్పినప్పుడు ఎన్నడూ నోరు మెదపని ఈ తెలుగుతల్లి ముద్దు బిడ్డలు ఇప్పుడు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసం తల్లిని రోడ్డుపైకి ఎక్కించారు. తెలుగు వాళ్ళందరమూ ఒక్కటే అని సవతి ప్రేమ చూపించి మళ్ళీ చంకనెక్కడానికి రెడీ అయితున్నరు.

ఇప్పుడు తెలుగుతల్లి తెలంగాణ ఉధ్యమాన్ని ఎదురుకోవడానికి లగడపాటి లాంటి జోకర్ల చేతిలో కీలుబొమ్మలా మిగిలింది. ఒక్కరోజులోనే కావలసిన బిడ్డలను తన గర్భసంచి నుండి పుట్టించి ఇవ్వగల రెడీ మేడ్ అమ్మగా మారింది.

(చారిత్రక ఆధారాలు నందిని సిధారెడ్డి గారు రచించిన "ఇగురం" అన్న పుస్తకం నుండి తీసుకోబడ్డవి)

Special Features